Wednesday 8 May 2024

కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అనవసరం!


ఎదుటివారు షేర్ చేసుకొంటున్న పెయిన్‌ను కూడా లైట్ తీసుకొని, సులువుగా ఇంకో వెరీ పెయిన్‌ఫుల్ మాట అనగలిగే సత్తా అందరికీ ఉండదు.

అయితే అది నోటి దూల అవుతుంది. లేదంటే "నేను మాత్రమే కరెక్టు" అనే అహంకారం అవుతుంది. 

రెండూ ప్రమాదకరమే. 

కట్ చేస్తే -

ఇప్పుడు చేస్తున్న నా తాజా సినిమా బడ్జెట్‌ను ఇప్పుటిదాకా అనుకున్న బడ్జెట్‌కు 66.6% ఎక్కువకి పెంచాను. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వటం కోసం తప్పటం లేదు. ఈ విజువల్ ట్రీట్‌లో ప్రధాన భాగం... హీరోయిన్స్. 

ఇన్వెస్టర్స్, టీమ్ అంతా కూడా హాపీ.   

ఇంక కాంప్రమైజ్ ఏం లేదు. అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ ముందుకువెళ్ళడమే.

త్వరగా ఫ్రీ అయిపోవడం ఒక ట్రాక్. ఎక్కడా ఆగకుండా పనిచేసుకొంటూ ముందుకెళ్తుండటం ఇంకో ట్రాక్. రెండూ నాకు చాలా ముఖ్యం. 

19 రోజుల ఈ ఎబ్రాడ్ ట్రిప్ తర్వాత ఉంటుంది అసలు కథ. అప్పటికి ఎలక్షన్ కోడ్ చాలావరకు రిలాక్స్ అయిపోవచ్చు.  

Make films that make BIG MONEY. 

Tuesday 7 May 2024

ఫిలిం కెరీర్ అంటే డబ్బొక్కటే కాదు!


తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే.

ఎవడి పిచ్చి వాడికానందం.

రాజకీయాలు, సినిమాలు, క్రికెట్... ఈ మూడింటికీ మన దేశంలో ఉన్నంత ఇంట్రెస్టు బహుశా వేరే దేశంలో ఉండకపోవచ్చు. ఈ మూడూ మన దేశంలో కోట్లాదిమంది జీవితాల్ని డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో చాలా ప్రభావితం చేస్తున్నాయి.

కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 

కట్ టూ సినిమా -  

మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసి వదిలేశాక, నా జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను. సుఖాల శిఖరాగ్రాలు, కష్టాల అగాధపు అంచులు. అన్నీ చూశాను.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, నా జీవితంలో ఎంతో విలువైన సమయం పరమ రొటీన్‌గా వృధా చేశాక, ఇప్పుడిప్పుడే నేను కోరుకుంటున్న స్వతంత్ర జీవనశైలివైపు అడుగులేస్తున్నాను.  

నిజానికి - అలా వృధా కాకపోతే, బహుశా ఇలాంటి ఆలోచన కూడా నాకు వచ్చేది కాదేమో!

కమర్షియల్ సినిమానా, కేన్స్ కు వెళ్లే సినిమానా... ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది, నువ్వేం చేయగలుగుతున్నావు అన్నది మొదటి ప్రశ్న. ఈ ప్రొఫెషన్ ద్వారా నువ్వెంత సంపాదిస్తున్నావు అన్నది రెండో ప్రశ్న.   

అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.

ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.

కట్ చేస్తే -  

వివిధ రూపాల్లో క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారు... 

సినిమా బాగోలేదని రివ్యూయర్స్ రాస్తుంటారు. చెత్తగా ఉందని మనమంటే పడనివాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. "డైరెక్టర్‌కు చేతకాలేదు, అసలు ఇలా తీయాల్సింది సినిమా" అని ఫిలిం మేకింగ్‌కు సంబంధించి అ ఆ లు కూడా తెలియనివాళ్ళు చెప్తారు. "అసలు ఆఫీల్డే వెధవ ఫీల్డు, అందులోకెందుకెళ్ళావ్" అని ఇంకొందరు నిలదీస్తారు. "ఇన్నేళ్ళయింది కదా, ఏం సాధించావ్" అని ఇంకొందరు ఉపన్యాసాలిస్తారు. 

ఈ క్రిటిసిజమ్‌కు లెక్క లేదు. అంతు లేదు. 

అయితే - అరుదుగా, వీళ్లలో కొందరు మాత్రం మన మంచి కోరి చెప్తారు, మనం ఇబ్బందుల్లో పడిపోకూడదని చెప్తారు. మిగిలినవాళ్లంతా జస్ట్ ఉచితసలహాదారులే. గట్టు మీద కూర్చొని రాళ్లేసేవాళ్లే. 

దూకినవాడికే కదా తెలుస్తుంది లోతెంతో! 

సో, నీ ఇంట్యూషన్ చెప్పినట్టు నువ్వు చెయ్యి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. 

మిగిలిందంతా జస్ట్ నాన్సెన్స్. 

పని చూసుకో! Just Do Your Work...


మన నేపథ్యం, మనం పెరిగిన వాతావరణం, మన అనుభవాలు... మనకో మైండ్-సెట్‌ను ఫిక్స్ చేస్తాయి. మనలాంటి మైండ్-సెట్టే అవతలివాళ్లకు కూడా ఉండాలనుకోంటే ఎలా?

కట్ చేస్తే -

జీవితంలో ఒక దశ దాటాక కొందరికి "నేను అనుకున్నదే కరెక్టు" అన్న మానసిక స్థితి స్థిరపడిపోతుంది. అది వారి వ్యక్తిగత విషయాలవరకు అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాని, అలాంటి మానసిక స్థితిలో ఎదుటివారిని జడ్జ్ చెయ్యడం అనేది పెద్ద తప్పు. ఈ విషయంలో కొందరిపట్ల ప్రేమతో, వారు సాధించిన విజయాల పట్ల ఆరాధనాభావంతో, వీరికి మనం ఇచ్చే గౌరవం అలుసు కాకూకడు. కాని, అవుతుంది. చివరికి అదొక అలవాటుగా కూడా మారిపోతుంది. అది చాలా ప్రమాదం.         

కట్ చేస్తే -  

సినిమా మీద పూర్తి దృష్టి పెట్టి, దాన్ని ఒక తపస్సులా పనిచేస్తున్నవారికే విజయావకాశాలు 5% లోపు ఉంటున్నాయి. అంతకంటే ఇంకా తక్కువ ఫలితాలుంటున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో - "అసలు సినిమా ఒక్కటే ఇప్పుడు నా ప్రొఫెషన్" అని ఫిక్స్ అయిపోయాక, ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి? కొత్త తలనొప్పుల్లోకి వెళ్ళటం ఎంతవరకు కరెక్టు? అలా వెళ్ళి నానా విధాల మాటలు వినటం, పడటం అవసరమా? 

నువ్వు ఏ పనిచేసినా, ఎవరిని కలిసినా, ఎవరితో సమయం గడిపినా... అది నీ ప్రధాన లక్ష్యం సాధించడానికి తోడ్పడేది అయ్యుండాలి. నిన్ను బాధపెట్టేది, నీ ప్రధాన లక్ష్యం నుంచి నిన్ను వేరు చేసేది, పక్కదారి పట్టించేది కాకూడదు. నీ మనసుని వ్యధపెట్టి, నీ బాధ్యతల్ని విస్మరించేలా చేసేది కాకూడదు.  

గైడెడ్ మిసైల్ ఎప్పుడూ దారి తప్పదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరిగ్గా వెళ్ళి లక్ష్యాన్నే ఛేదిస్తుంది. సరిగ్గా సెట్ చేసిన సమయానికే ఛేదిస్తుంది.

ఒక్కసారి ఆలోచించు... నువ్వు ఎన్నిరోజులు, ఎంతకాలం బ్రతుకుతావో తెలీదు. 

Just do your work. Live life to the fullest. Everything else is just bullshit.   

Saturday 4 May 2024

Happy Birthday Sir!


ఒకే ఒక్క సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేసి రిలీజ్ చేయగలరా?

"అవును, చేయొచ్చు" అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు! స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే.

ఒకే రోజు 4 చోట్ల 4 సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. దర్శకుడు మాత్రం ఒక్కరే. దాసరి గారు! ఎక్కడికక్కడ షాట్స్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్‌కి చెబుతూ, 4 లొకేషన్లకు తిరుగుతూ, తీసిన షాట్స్ చూసుకొంటూ, అన్నీ మళ్లీ రివ్యూ చేసుకోవడం, అవసరమైతే కరెక్షన్స్ చేసుకోవడం. అద్భుతం ఏంటంటే, అలా తీసిన 4 సినిమాలూ హిట్ సినిమాలే కావడం!

ఇలా తన పనిలో ఎక్కువభాగం చూసుకొన్న అప్పటి తన అసోసియేట్ డైరెక్టర్స్‌కు గురువుగారు "కో-డైరెక్టర్" అన్న టైటిల్ కార్డ్ కొత్తగా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు. అదీ తన అసిస్టెంట్స్‌కు దాసరిగారిచ్చిన గౌరవం.

ఈ 'కో-డైరెక్టర్' కార్డ్ నేపథ్యం ఇప్పటి కోడైరెక్టర్లలో ఎంతమందికి తెలుసు?

ఇండస్ట్రీ చరిత్రలో మొట్టమొదటిసారిగా "డైరెక్టర్" పొజిషన్‌కు ఒక స్థాయి, ఒక విలువ, ఒక గౌరవం, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన ఘనత గురువుగారిదే. అప్పట్లో ఆయన చెన్నై నుంచి ఫ్లైట్‌లో హైద్రాబాద్ వచ్చారంటే చాలు. ఇక్కడ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో కనీసం ఒక 30 కార్లలో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అభిమానుల కాన్వాయ్ ఎప్పుడూ రెడీగా ఉండేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. దటీజ్ డైరెక్టర్ దాసరి! 

కట్ చేస్తే -

'లెజెండ్' దాసరి గారి దగ్గర ఒకే ఒక్క సినిమాకు నేను అబ్జర్వర్/అసిస్టెంట్ డైరెక్టర్‌గా  పనిచేయగలగడం నా అదృష్టం. ఆ 4 నెలల సమయంలో ఆయన నాపట్ల చూపిన ప్రేమ, అభిమానం నేను ఎన్నటికీ మర్చిపోలేను.

> ఆయన చెప్పిన జోకులు, తెలుగులో ఒక్క అక్షరం స్పెల్లింగ్ తప్పుగా రాసినా ఆయన పట్టుకొనే విధానం, తాజ్ బంజారాలో మరో కొత్త సినిమా కథా చర్చలు, మధ్యలో ఒక కథకు అమితాబ్ బచ్చన్ గారిని ఒక క్యారెక్టర్‌ కోసం అనుకొని, అప్పటికప్పుడు ఆయనకు కాల్ చేయడం, టైమ్ కాని టైముల్లో, ఆయన సొనాటా కారులో వెనక ఇద్దరు గన్‌మెన్స్ మధ్య టెన్షన్‌తో కూర్చుని ఆయనతోపాటు నేను తిరిగిన ట్రిప్పులు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కు ఆయనిచ్చే గౌరవం, అవసరమయినప్పుడు చూపించే ఆ క్షణపు కోపం .. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో .. గురువుగారికి సంబంధించి నేను మర్చిపోలేని అద్భుత  జ్ఞాపకాలు.

> జూబ్లీహిల్స్‌లోని మణిశర్మ 'మహతి' రికార్డింగ్ థియేటర్లో, రికార్డింగ్‌తో ప్రారంభించిన నా తొలి చిత్రం "కల" కోసం నేను ఆహ్వానించగానే గురువుగారు ఎంతో సంతోషంగా వచ్చి, పూజదగ్గరే గంటసేపుకి పైగా నిల్చుని, తనే స్వయంగా అన్ని పూజా కార్యక్రమాలు దగ్గరుండి నా చేత చేయించటం, తర్వాత థియేటర్ లోపల రికార్డింగ్ ప్రారంభించడం, ట్యూన్‌లు, ట్రాక్‌లు అన్నీ చాలా ఓపిగ్గా వినడం .. నాకు బెస్ట్ విషెస్ చెప్పడం .. నేనెన్నటికీ మర్చిపోలేని మరో మధురసృతి.

థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్! ... మీరు లేరని నేననుకోవడంలేదు. అనుకోలేను. 

So, wherever you are... Happy Birthday Sir!
And... Happy Directors' Day to All the Lovely Directors Out There!! 

***

(గురువుగారి మీద నా పాత బ్లాగ్ పోస్టును కాస్త నిడివి తగ్గించి రీ-పోస్ట్ చేశాను.) 

Wednesday 24 April 2024

కొత్త ఫిమేల్ సింగర్స్ (4 గురు) వెంటనే కావాలి!

> మిలియన్స్‌లో మీ పాట ప్రపంచమంతా వినాలనుకుంటూన్నారా? 
> సెలబ్రిటీ ఫిలిం సింగర్ కావాలనుకుంటున్నారా? 

ఇది మంచి అవకాశం. 


ఈ యాడ్ చదవండి, అప్లై చేయండి. 
అప్లై చేసుకోడానికి చివరి తేది: 28-04-2024

email: mchimmani10x@gmail.com 

ఒక సినిమా, రెండు దారులు!


ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే – ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు. ఎంచుకొని తీరాలి. 

మొదటి దారి – మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని, దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం. 

రెండో దారి – మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయడం.

మొదటి దారిలో – మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ గుర్తించము. కనీసం మనలో కూడా ఎంతో కొంత ‘విషయం’ ఉందన్న నిజాన్ని గుర్తించడానికి కూడా మనం ఇష్టపడము. “నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. 

ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. 

రెండో దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు.

ప్రతి వందమందిలో 5 గురు మాత్రమే ఈ బాటలో ఉంటారు.

మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు ఈ 5 గురు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు.

కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు, కాని ఫలితాలు మాత్రం అవే ఫాలో అవుతుంటాయి... విజయవంతంగా. 

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే...

ఒక్క 5 శాతం మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు.

95 శాతం మంది పనిలేకుండా బిజీగా ఉంటారు. 

ఇప్పుడు చెప్పండి... ఏ బిజీ మీకిష్టం? 

Tuesday 23 April 2024

కొత్త లిరిక్ రైటర్స్‌కు అవకాశం!

> టాలెంట్ ఉండి, "ఒక్క ఛాన్స్" కోసం చూస్తున్న కొత్త లిరిక్ రైటర్స్‌కు మాత్రమే ఈ అవకాశం 
> తెలంగాణ మాండలికంలో మేమిచ్చే ట్యూన్స్‌కు పాటలు రాయగలగాలి.


ఇంక మీదే ఆలస్యం!  

అప్లై చేసుకోడానికి చివరి తేది: 28 ఏప్రిల్ 2024. 
email: mchimmani10x@gmail.com 

Saturday 20 April 2024

రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్!


"మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఇవి రెండూ జరగని ఊరు లేదు. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి!” 

రజినీకాంత్ ఈ మాట ఊరికే అనలేదు. ఆయన అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో వందలు చూసుంటారు. 

కట్ చేస్తే - 

ఒక టెక్నీషియన్‌గా తన పని, పరిమితుల పట్ల కనీస అవగాహన లేని అనుభవానికి అర్థం లేదు.  

డైరెక్టర్ విజువల్‌గా తనకు ఏం కావాలో, ఎలా కావాలో చెప్పి చేయించుకోడానికే కెమెరామన్. 

ఈ కనీస అవగాహన లేనిచోట ఈగో ఉంటుంది. "డైరెక్టర్‌కు నాకంటే బాగా తెలుసా" అన్న చిన్నచూపు ఉంటుంది. ఇంక, నానా ఫీలింగ్స్ ఉంటాయి. 

"అరుపులు కేకలు లేకుండా కూల్‌గా షూటింగ్ చేసుకుందాం" అని నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా అన్నందుకు, "యూనియన్‌కు వెళ్తా" అని ఒక సీనియర్ కెమెరామన్ నా సినిమా షూటింగ్ ఒకరోజు దాదాపు ఆపేసినంత పనిచేయడం నాకింకా గుర్తుంది. తర్వాత మేమిద్దరం మంచి మిత్రులమయ్యాం. అది వేరే విషయం. 

అద్భుతమైన స్కిల్ ఉండి కూడా, కేవలం ముక్కుమీద కోపం, ఇలాంటి చిన్న చిన్న ఈగోల వల్ల ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎందరో ఉంటారు. ఎన్ని అవలక్షణాలున్నా కొందరు మాత్రం అంత త్వరగా ఎగ్జిట్ కారు. ఆ కొందరికి కొన్ని ఎక్‌స్ట్రా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అలా వదిలేద్దాం. 

కట్ చేస్తే - 

ఇప్పటికే నాలుగైదు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ స్పీచ్‌లంటే నాకు చాలా ఇష్టం. 

ఎక్కడా తడబడకుండా, స్పష్టమైన తెలుగులో ధారాళంగా మాట్లాడతారు. తను చెప్పాలనుకున్న పాయింట్ నుంచి అంత సులభంగా డీవియేట్ అవరు. స్వల్పంగా అలా కాస్త పక్కకెళ్ళినా, చివరకు ఒక మాంచి మేకు దిగ్గొట్టినట్టుగా తను చెప్పాలనుకున్నది చెప్పి స్పీచ్ ముగిస్తారు. 


ఇవ్వాళ "ఎక్స్"లో ఆయన లెటర్ హెడ్ మీద రాసి పెట్టిన పోస్టు చూశాక ఈ బ్లాగ్ రాయాలనిపించింది...

ఎంతయినా తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్, తనకంటే సీనియర్ అయిన కెమెరామన్ మీద ఈ పోస్టు పెట్టడానికి ముందు ఆయన ఎంత మథనపడివుంటారు? ఎంత బాధపడివుంటారు? 

టీవీచానెల్స్‌లోనో, యూట్యూబ్ చానెల్స్‌లోనో ఎన్నయినా ఇంటర్యూలిచ్చుకోవచ్చు. ఆయా చానెల్స్ కోరుకొనే ఏ బుల్‌షిట్ అయినా మాట్లాడుకోవచ్చు. కాని, ఇంకొకరిని బాధపెట్టేలా కాదు. 

నీకు మరీ అంత కోరిక ఉంటే డైరెక్టర్ కావచ్చుగా?

కాలేకపోతే అక్కడితో మర్చిపో.

అంతే కాని, ఇంకో శాఖలో పనిచేస్తూ, తనే డైరెక్టర్ అయినట్టుగా ఫీలవ్వటం, అలాంటి భ్రమలో ఉంటూ డైరెక్టర్స్‌ను ఇలా కెలకటం, బాధపెట్టడం నిజానికి అందరూ చేయరు. 

చేసే కొందరితోనే సమస్య. 

అప్పటికప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను కెమెరామన్‌ను చేసి, సక్సెస్‌ఫుల్‌గా సినిమా పూర్తిచేసి, హిట్ చెయ్యగలిగిన రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే ఇలాంటి వారికి బెస్ట్ ఆన్సర్స్.   

పి సి శ్రీరాం, రవి కె చంద్రన్, అనిల్ మెహతా, రాజీవ్ మీనన్, సంతోష్ శివన్ లాంటి గొప్ప కెమెరామెన్ల యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలు నేను చూసినట్టు గుర్తులేదు. ఒకవేళ వారి ఇంటర్వ్యూలు ఉన్నా, "అంతా నేనే" అన్న పనికిరాని ఈగోతో మాట్లాడివుండరు. వారు కలిసి పనిచేసిన డైరెక్టర్స్ గురించి తప్పుగా అసలు మాట్లాడివుండరు.  

Because they know very well that the cinematographer is essentially translating the director's vision into imagery, not engaging in any politics.  

- Manohar Chimmani 

Friday 19 April 2024

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు!


6 గురు మ్యూజిక్ డైరెక్టర్స్... 

ఒకరు 21 సినిమాలు చేశారు. ఇంకొకరు 11 సినిమాలు చేశారు. ఇంకొకరు 3 సినిమాలు ఒకేసారి ఇప్పుడు, రైట్ నౌ, చేస్తున్నారు. ఇంకో ఇద్దరు మ్యూజిక్ లోనే బాగా సంపాదిస్తూ పిచ్చి బిజీగా ఉన్నారు. 

ఈ 6 గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌లో దాదాపు అందరికీ సొంత రికార్డింగ్ సెటప్స్/స్టూడియోలు ఉన్నాయి. ఒకరికి 3 నగరాల్లో 3 స్టూడియోలున్నాయి. 

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో కావల్సినంత ఉంది. ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో యునిక్. 

పైగా, అందరికీ ఫీల్డులో ఎన్నెన్నో అనుభవాలున్నాయి.   

వీరందరితో ఇంటర్వ్యూలు #Yo ఆఫీసులో జరిగాయి. ఈ ఆరుగురూ #Yo లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు... ఏ క్షణం ఓకే చెప్తానా అని! 

సినీఫీల్డులో ఒక అవకాశానికున్న విలువ అది.  

ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మా కోర్ టీమ్ మొత్తం నేను చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ చూశారు. 

సో వాట్? 

మా ప్రదీప్‌చంద్ర మాత్రం మాకు దొరకటం లేదు... అతనికంత టెన్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే - ఈ అవకాశం కోసం, పై 6 గురికి ఉన్న టెన్షన్లో కనీసం 0.001% కూడా లేదు. 

ప్రదీప్ ఎక్కడ మిస్ అవుతాడా అని నేను పర్సనల్‌గా పడుతున్న టెన్షన్లో కనీసం 0.0001% కూడా అతనికి లేదు. 

ఇది కూడా ఎలాంటి అతిశయోక్తి లేని నిజం.   

Monday 15 April 2024

నీ సుఖమే నే కోరుతున్నా...


మనం చూసే దృష్టిని బట్టే మనకు అన్నీ కనిపిస్తాయి...

మనుషుల్లో నేను మంచిని, గొప్పతనాన్ని, సంకల్పబలాన్ని, మానవత్వాన్ని చూస్తాను. కొందరు లేని చెడు కోసం ఎప్పుడూ తవ్వకాలు చేస్తుంటారు. 

అదొక అనారోగ్యం అనుకొని జాలిపడటం తప్ప మరేం చెయ్యలేం.

పడుతున్నాడు కదా అని ఎదుటి మనిషిని ఏ మాటపడితే అది అనడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలా ఏ మాటపడితే అది ఎలా అనగలుగుతున్నావో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. 

అందరూ ఒకలాగే ఉండరు. నువ్వు అనుకుంటున్నట్టు అసలు ఉండరు.

ఒక మనిషి గురించి ఒకసారి నువ్వు తప్పుగా ఆలోచించడం మొదలుపెడితే - అతను పుట్టినప్పటినుంచీ మనకు అతనిలో తప్పులే కనిపిస్తాయి. అతను దగ్గినా తుమ్మినా కూడా తప్పుగానే కనిపిస్తుంది. 

ఒకరివైపు మనం ఒక వేలు చూపిస్తున్నప్పుడు, మనవైపు ఎన్ని వేళ్ళు ఉన్నాయో మనం తప్పక చూసుకోవాలి.

విత్ దట్ సెడ్...  

బహుశా కొన్ని అనారోగ్యాలు కూడా ఇలా చేయిస్తాయేమో అని కూడా ఆ వ్యక్తి గురించి నేను పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నాను. 

ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి బాధపడుతున్నాను. 

ఆ వ్యక్తి పైన జాలిపడుతున్నాను. 

ఆ అవ్యక్తిని ఇంకా ప్రేమిస్తున్నాను. 

అన్-కండిషనల్ సారీ చెప్పేదాకా, ఆ వ్యక్తిని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. 

కట్ చేస్తే - 

ముందూ వెనకా ఆలోచించకుండా - ఒక వ్యక్తికి - అత్యున్నత గౌరవమిచ్చి, ప్రేమనిచ్చి మాట్లాడటం కూడా తప్పే అని తెలుసుకోవడం ఈమధ్యకాలంలో నాకు మరొక కొత్త జ్ఞానోదయం. 

అయినా సరే, నీ సుఖమే నే కోరుతున్నా...             

***

(నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి, మరేదీ పట్టించుకోకుండా, అనారోగ్యం నుంచి అతిత్వరగా కోలుకోవాలని ఆశిస్తూ రాసిన బ్లాగ్ ఇది.)